Friday, June 19, 2009

ఆంధ్రులు

సృష్ట్యాదియందు "ఆర్యజాతి" తప్ప వేరుజాతి లేదు. ఆర్యులు భారతవర్ష మంతటను వ్యాపించి నివసించియుండిన కాలములో నాయా దేశభాగములను పరిపాలించిన రాజుల పేరున ఆయా దేశములు పిలువబడినవి. అట్టి దేశములలో నివసించిన ప్రజ లాయాదేశనామములచే పిలువబడ జొచ్చిరి. అట్లు పిలువబడిన పేర్లతో వారే వేరువేరు జాతులుగా గుర్తింపబడి యుండిరి.
ఆర్యులు దేశవ్యాప్తము నొంది నివసించియుండిన పిమ్మట ఒకానొకకాలమున తూర్పుభారతవర్షము "ప్రాచ్యక దేశ" మనిపేరు గలిగి "బలి" యనెడి రాజుచే పరిపాలింపబడుచుండినది. ఆతని కుమారులా దేశమును విభాగించుకొని తమ పేర్లతో నా దేశభాగములకు పేరులుపెట్టి యేలిరి. వారిలో "ఆంధ్రరాజు" పరిపాలించిన భాగమునకు "ఆంధ్రదేశ"మని పేరు పెట్టబడినది. ఆ దేశమున నివసించుచుండిన చాతుర్వర్ణ్య ఆర్య ప్రజలు నా దేశముపేరున "ఆంధ్రులు" అని పిలువబడిరి. ఆర్యజాతియే ఆంధ్రజాతి యని పిలువబడినది. అది వేరుజాతి కాదు. ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములలో సృష్ట్యాదినుండి "ఆంధ్రు"లను పేరు వచ్చువఱకు ఆంధ్రుల చరిత్ర ఆర్యుల చరిత్రయే గాని వేఱు కాదు. అందువలన సృష్ట్యాది లగాయతు ఆంధ్రుల చరిత్ర ఆర్యుల పేరుమీదనే చెప్పబడును. దానిని ఆంధ్రుల చరిత్రగానే తీసికొనవలయునుగాని అది ఆంధ్రుల కంటె వేఱుగాగల ఆర్యుల చరిత్ర యని భ్రమించకూడదు. 'ఆంధ్రులు' ఆర్యులేగాని యితరులు కారు. ఒకేజాతివారు ప్రారంభములో "ఆర్యు"లనియు, కొంతకాలమునకు వారే "ఆంధ్రు"లనియు పిలువబడిరి. వారు రెండు జాతులవారు కారు. ఏకజాతీయులైయున్నారు. ఇదేప్రకారము భారతవర్షములోని వివిధ రాష్ట్రములయందు నివసించెడి ఆర్యులును ఆయా దేశనామములచే వివిధ శాఖలుగానై వివిధ జాతులుగా పరిగణింపబడుచుండిరి. కాని ఆసేతుహిమాచలముగా గల ఆర్యులందరు ఏకజాతీయులైన ఆర్యులే యైయున్నారు. ఈవిషయము మనసునందుంచు కొని ఈ గ్రంధమును (కోట వెంకటా చెలం గారి ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు) చదివిన "ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరము" లేవియో వివరముగా సృష్ట్యాదినుండియు తెలియగలవు.

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు

ఒక దేశముయొక్క గాని, జాతియొక్క గాని చరిత్ర వ్రాయుటకు ప్రాచీనకాలమునుండి వచ్చు చుండిన సంప్రదాయముగాని (Tradition) లేక వ్రాతమూలకమైన పూర్వచరిత్రగాని ఆధారముగా నుండవలెను. అట్టిదేమియు లేక కేవలమొక మనుష్యుని యొక్క ఊహలు, కల్పనలు, నమ్మకములు, సంభావ్యతలు (Probabilities or possibilties) మొదలగువానితో వ్రాయబడినది సత్యమైన చరిత్రలు కాజాలవు. అవి కల్పనాకథ లనిపించుకొనును.
ఏదియో యొక వార్తను విని దానిని తనయూహలతోను, కల్పనలతో డను పెంచి ప్రస్తుతము తన యనుభవములో గల యొక విషయమున కదుకుపెట్టి తాను మొదట వినిన వార్త యొక్క యథార్థ చరిత్ర యిదియేయని గ్రంథములల్లి లోకములో ప్రకటించినంతమాత్రమున అది యథార్థ చరిత్ర యనిపించుకొనదు. అది చరిత్రకు ద్రోహము చేయుట యగును. ఇప్పుడు పాశ్చాత్య ప్రాచ్య చరిత్రకారులచే వ్రాయబడిన ఆధునిక భారతదేశ చరిత్రలనున్న వన్నియు వారివారి యూహా కల్పితములై యున్నవి. అందు సత్య మావంతయును కానరాదు.
మానవజాతి మధ్యా సియాయందు పుట్టి భూగోళమంతటను వ్యాపించిన దనెడి వాదము పాశ్చాత్య చరిత్రకారుల యూహాపోహలతో కల్పింపబడినది గాని దానికి పూర్వ చరిత్రాధార మేమియు లేదు. ఒక చరిత్రకారుని యూహ మరియొక చరిత్రకారుని యూహకు ప్రమాణమై తాము ముందుగా నిర్ణయించుకొనిన యొక నిర్ణయమున కనుకూలముగా నుండునట్లు పర్యవసానము తేల్చబడి లోకమున ప్రచారము చేయబడినది. చిరకాలము వినగావినగా అదియే సత్యమైన చరిత్ర యని లోకులు భ్రమించి దాని ననుసరించి చరిత్రలు వ్రాసికొనుచుండిరి. పాశ్చాత్యులచే వ్రాయబడిన అట్టి కల్పితకథలే భారతదేశ చరిత్రకాధారభూతమై తదనుసారముగా నాధునిక చరిత్రలు వ్రాయబడి మనకు పాఠాశాలలలో నేర్పబడుచున్నవి. వీనిని విసర్జించి మనము మనవాఙ్మయాదుల ననుసరించి యథర్థాచరిత్రలనువ్రాసికొనుట అత్యావశ్యకము.

సృష్టిక్రమము

ఇప్పటి సృష్ట్యాదియందు ప్రకృతినుండి స్వాభావికముగా పంచ భూతములును, అందు భూమినుండి ఓషదులును, ఓషధులనుండి సర్వ భూతకోటియు దేవమానవాదివర్గములు క్రమక్రమముగా నుద్భవించినవి. అందు మొదట వచ్చినది ప్రజాపతి. ఇతడు ప్రధమ ఆర్యుడని ఋగ్వేదము 4-26-2-2; 2-11-18 ఋక్కులయందు వినబడుచున్నది. ప్రధమ ఆర్యుడైన స్వాయంభువప్రజాపతి మానవసృష్టిని జేయబూని వసిష్టాదులైన పదిమంది ప్రజాపతులను(వీరికి దేవఋషులని పేరు) సృజించెను. పిమ్మట స్వాయంభువప్రజాపతి భూమి మీద మానవసృష్టిని జేయబూని భారతవర్షమునగల సరస్వతీ, ద్రుషద్వతీనదుల మధ్యస్థనమై భూమియందు ప్రధమమున నివసించి 'శతరూప' యను భార్యతో కలిసి ప్రియవ్రత, ఉత్తానపాదులనెడి ఇద్దరు కుమారులను, ఆకూతి, దేవహుతి, ప్రసూతు లనెడి ముగ్గురు కుమార్తెలను కనెను. అతడు ప్రధమమున నివసించిన భూమి "బ్రహ్మావర్త" మని పిలువబడుచున్నది.

బ్రహ్మవర్తదేశము

మానవజాతి మొదట భారతదేశమునే యుత్పత్తిని బొందినది. ఇప్పుడు భారతదేశమునగల యమునానదికి పశ్చిమమున 'సరస్వతీ' నదియు, దానికి పశ్చిమమున 'దృషద్వతి' యనెడి దాని యుపనదియు నుండెడివి. ఈ సరస్వతీ, దృషద్వతి నదుల మధ్యగల ప్రదేశము ' బ్రహ్మవర్తమని ' అనాదికాలమునుండియు పిలువబడుచుండెడిది. ' బ్రహ్మవర్త ' మనగా బ్రహ్మ యను పేరుగల స్వాయంభువ ప్రజాపతి మానవజాతిని భూమి మీద నిలుపుటకు ఆదికాలమున స్థూల దేహధారియై నివసించిన స్థలము.
ప్రతిసృష్టియందును ఆదిమానవుడైన ' స్వాయంభువ ' ప్రజాపతి స్థూలదేహధారియై మానవసృష్టి నిమిత్త మెచ్చటావర్తమును బొందుచు నివసించుచుండునో అట్టి దేశము " బ్రహ్మవర్తమని " అనాదికాలము నుండియు దేవతలచే పిలువబడుచుండినది. ఋగ్వేదమున వినబడిన " యోనిం దేవకృతం " (ఋగ్వే 3-33-4) దేవతలచే చేయబడిన మానవజాతి జన్మస్థానము అనువాక్యమును మనువు తన మనుస్మృతి యందు " తం దేవనిర్మితం దేశం " (అనగా దేవతలచే ఏర్పాటు చేయబడిన ఆప్రదేశము) అనివివరించి దాని హద్దులను కూడ ఇచ్చియున్నాడు. (మను 2-17) తూర్పు - సరస్వతీ నది, దక్షిణము సరస్వతీదృషద్వతీనదుల సంగమస్థలము పడమర దృషద్వతీనది ఉత్తరము హిమాలయపర్వతములలో సరస్వతీ, దృషద్వతీనదుల జన్మస్థలముల వఱకు.

బ్రహ్మర్షి దేశము (ప్రధమవలస)

అట్టి బ్రహ్మవర్త దేశమందు పుట్టి " ఆర్యులు " అనబడు మానవజాతి తాము జన్మించిన " బ్రహ్మవర్త " దేశము వదిలి దానికి పశ్చిమమున గల ప్రదేశములందు నివసించి దానికి (మను 2-19) బ్రహ్మర్షి దేశమని పేరిడిరి. ఈ వలసలను విశేషముగా మహాతపశ్శాలులైన బ్రహ్మర్షులు నడిపి వారలే వారి శిష్యప్రశిష్యులతో అచ్చట నివసించి యుండుటవలన దానికి బ్రహ్మర్షి దేశమనెడి నామము సార్థకమైనది. ఈ ప్రదేశమున ఇటీవల కురుక్షేత్రము, మత్స్యదేశము, పాంచాలము, శూరసేనము, ఉత్తరమధుర యను పేర్లతో రాష్ట్రము లేర్పడినవి.

మధ్య దేశము (ద్వితీయవలస)
వింధ్యపర్వతము, హిమాలయపర్వతముల మధ్యయందు ప్రయాగకు ( అలహాబాదు ) పడమరగా సరస్వతీనదివరకు గల ప్రదేశమంతయు " మధ్యదేశము" అని పిలువబడుచుండినట్లు మనువు చెప్పుచున్నడు. (మను 2-21 ) బ్రహ్మఋషిదేశము నిండిన పిమ్మట రెండవ వలసలో వెడలిన ఆర్యసంతానము ఈ మధ్యదేశమున నివసించిరి.

ఆర్యా వర్తము (తృతీయ వలస)
అటుపిమ్మట ఆర్యజాతీయులు మహర్షుల యనుజ్ఞవలన వారి రాజుల నాయకత్వమున మూడవ వలసగా బయలుదేరి వింధ్యహిమాచలములకు మధ్యనుండు ఖాళీప్రదేశ మందంతటను వ్యాపించి స్థిర నివాసము లేర్పరచుకొనిరి. ఆనాటికి భూగోళమంతయు నిర్మానుష్యముగా నుండి యున్నది. భారతవర్షములో గూడ నిప్పుడు మనవిచారణ యందుండిన ఆర్యజాతీయులు తప్ప యితరమానవు లెవ్వరును లేరు.

నాల్గవ, ఐదవ వలసలు
అటుపిమ్మట విదేహమాధవు డనెడి రాజు తన గురుదేవుడైన గౌతమరహూగణుని ప్రేరణమున నానాటికి వృధ్ధినిగాంచుచుండిన ఆర్యజాతీయుల వెంట నిడికొని బ్రహ్మవర్తాది ప్రదేశములనుండి యొక గొప్ప వలసను బయలుదేరదీసి సరస్వతీనదికి తూర్పుగా గంగానదివఱకు బోయి అచ్చటచ్చట ఆర్యనివాసములు నేర్పాటుచేసి యుండిరి కాని అచ్చట " సదానీరా " అనెడి యొక నది అడ్డమురాగా ఆవలస నంతటితో నిలిపి అంతవఱకు వచ్చిన పొడుగునను, గ్రామముల, పట్టణముల నిర్మానమొనర్చిరి. సదానీరా నదికావల ప్రదేశము నివాసయోగ్యము కానందున దానిని నివాసయోగ్యముగా చేయుటకు తగిన యేర్పాట్లు చేసి తిరిగి పశ్చిమముగా వెళ్లి గంగా, యమునా, సరస్వతీ, దృషద్వతీ నదులను దాటి ఉపనదులతో గూడిన సింధునదిని దాటి పశ్చిమమున సింధునది కుపనది యగు ' కుభా ' (అనగా కాబూలు నది ) నదీతీరముల వఱకు తమ వలసలను విస్తరింప జేశి యుండిరి. ఈ వివరములను ఋగ్వేదము, శతపధబ్రాహ్మణము, మనుస్మ్రుతి మొదలగు వానియందు సవిస్తరముగా వివరింపబడి యున్నది.

"ఆర్యాః అత్ర ఆవర్తంతే పునః పున రుద్భవంతి ఇతి ఆర్యావర్తః ". ఆర్యులు లెచ్చట పుట్టి, పెరిగి, చచ్చి, తిరిగి పుట్టుచుందురో అది ఆర్యావర్తమని చెప్పబడుచున్నది. దీనిని బట్టి ఆర్యులు ఈ ప్రదేశముమందుననే సృష్టి ప్రారంభమునుండి పుట్టి నివసించుచుండిరని మనుస్మ్రుతి యందు స్పష్టము చేయబడినది. ( పాశ్చాత్యులూహించినటుల ఆర్యులు మధ్యాసియా యందు పుట్టి భారతవర్షమునకు వలస వచ్చినరుట కేవలము వారి కల్పనయే కాని పూర్వ చరిత్ర వలన ధ్రువ పరచబడినది కాదు )

దక్షిణా పధము ( ఆఱవ వలస )

అటుపిమ్మట ఆర్యుల దృష్టి వింధ్యపర్వతములకు దక్షిణముగా గల ప్రదేశములమీదకు ప్రసరించినది. ఆనాడు దక్షిణదేశమంతయు నిర్మానుష్యముగా నుండినది. ఆర్యులు ' సదా నీరా ' ప్రాంతప్రదేశము నంతను మానవ నివాసమున కనుకూలముగా నొనర్చి పిమ్మట తూర్పున గల వంగదేశప్రాంతములమీదుగా దక్షిణమునకు క్రమక్రమముగా వ్యాపించిరి. అనేక సంవత్సరములు గడచుచుండగా అట్లు ఆర్యులు వ్యాపించిన భారతవర్షపు తూర్పుదక్షిణములగల ( అనగా ఇప్పటి మద్రాసు దిగువ వఱకు ) ప్రదేశము " ప్రాచ్యక దేశ " మని పిలువబడినది. దానికి దక్షిణముగా దక్షిణసముద్రమువఱకు గల దేశము దక్షిణ దేశమయ్యెను. ఆరెంటికి పశ్చిమముగా గల పశ్చిమకొస్తా ప్రదేశము పశ్చిమదేశమయ్యెను. అదే విధమున ఆర్యులు " దక్షిణాపధ " మంతయునాక్రమించి వృధ్ధిపొందిరి. ఆసేతుహిమాచలముగా గల దేశమునంతను ఆక్రమించిన ఆర్యులు వైదిక ధర్మావలంబులై చాతుర్వర్ణ్య వ్యవస్థ గలిగి యుండిరి.

(మిగిలినది తరువాతి భాగములో,Contd in Next part...)

No comments:

Post a Comment